రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

  • ఏపీలో పలు చోట్ల ఇంధన కొరత... పెట్రోల్ బంకుల మూసివేత
  • ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు
  • ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్
  • కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని వార్నింగ్
సోమవారం నుంచి రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయిల్ కంపెనీలకు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రజల నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్ సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదని సీఎం తేల్చి చెప్పారు. రిటైల్ ఔట్‌లెట్లకు క్రెడిట్ నిలిపివేసి, సరఫరా ఆపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా నిలిపివేయడంతో సమస్య తీవ్రమైందని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి తోడు వరికోతలు, అగ్రి, ఆక్వా రంగాల నుంచి డీజిల్‌కు డిమాండ్ పెరగడం కూడా కొరతకు కారణమైంది.

మూడు రోజుల క్రితమే సమస్యను గుర్తించినా ఎందుకు తక్షణ చర్యలు తీసుకోలేదని కంపెనీల ప్రతినిధులను సీఎం ప్రశ్నించారు. నివేదికలు కాదు, ఫలితాలు చూపించాలని ఆదేశించారు. ఈ సమస్యను తక్షణం చక్కదిద్దేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరగకూడదని, రైతులకు ఇబ్బంది లేకుండా కూపన్ విధానంపై ఆలోచించాలని అధికారులకు సూచించారు. సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు మరోసారి హెచ్చరించారు.

Chandrababu Naidu
Andhra Pradesh
petrol shortage
diesel shortage
fuel supply
oil companies
no stock
fuel crisis
AP fuel crisis

More Telugu News